: కాంగ్రెస్ కు, మిత్ర పక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారు: వెంకయ్యనాయుడు
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండంకెలకు మించి సీట్లు రావని తాము ముందే చెప్పామన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ కు ఇంతకంటే తక్కవ సీట్లు ఎప్పుడూ రాలేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ మిత్ర పక్షాలకు కూడా ప్రజలు బుద్ధి చెప్పారని వెంకయ్య పేర్కొన్నారు.
తమిళనాడులో ఎంతో పేరున్న కరుణానిధి పార్టీ డీఎంకే, యూపీలో మాయావతి పార్టీ బిఎస్పీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వివరించారు. ఇక కాంగ్రెస్ ను సమర్థించిన వామపక్షాలు వాటి ఉనికిని కోల్పోయాయన్నారు. మోడీ వస్తే దేశానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు నమ్మారని, అందుకే తమకు ఓటు వేశారని విశ్లేషించారు. ఇక ప్రధానంగా ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు తెరదించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాని కనబడలేదని... తల్లీకొడుకులు మాత్రమే ప్రచారం సాగించారని చెప్పుకొచ్చారు. ఈ అంధకార సమయంలో ప్రజలకు ఆశాకిరణంగా మోడీ కనిపించారని చెప్పారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు కసిగా ఉన్నారని, నమ్మక ద్రోహాన్ని ప్రజలు సహించలేకపోయారన్నారు. రాహుల్ అహంకారం, అసమర్థతను కూడా భరించలేకపోయారని తెలిపారు. మోడీని వ్యక్తిగతంగా దూషించడం రాహుల్ అహంకారానికి నిదర్శనమని వెంకయ్య వ్యాఖ్యానించారు.