: మోడీ భాయ్ వచ్చాడు... తీపి కబుర్లు తెచ్చాడా?
నరేంద్రమోడీ సంపూర్ణ మెజారిటీతో ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. అదే సమయంలో దేశంలో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల్లో కొన్ని ఆశలున్నాయి. వాటిని మోడీ భాయ్ తీరుస్తారా? సామాన్యుల నోళ్లను తీపి చేస్తారా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ముఖ్యంగా జీవన వ్యయం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆదాయపన్ను పరిమితిని 3లక్షల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఉంది. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారం పన్నులను తగ్గించడానికి ప్రభుత్వానికి పెద్దగా అవకాశం లేదని పీడబ్ల్యూసీ ఇండియా డైరెక్టర్ కుల్దీప్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కల్పించవచ్చన్నారు.
ఇక ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను వేస్తున్నారు. దాన్ని తొలగించాలనే డిమాండ్ ఉంది. అలాగే, సెక్షన్ 80సీ ప్రకారం బ్యాంకు డిపాజిట్లు, తదితర పెట్టుబడుల్లో ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది. దాన్ని రెండు లక్షల రూపాయలకు పెంచాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. నిజానికి ఈ హామీలన్నీ బీజేపీ 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చినవే. అయితే, తాజా ఎన్నికల్లో వీటి గురించి మాట్లాడలేదు. అయినా, వీటిని అమల్లోకి తేవడానికి అవకాశాలున్నాయని కొందరు భావిస్తున్నారు.