: ఆ రకంగా చూస్తే... బొత్స బెటరే!
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 175 సీట్లలో ఒకే ఒక్క సీటులో కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకుంది. ఆ ఒక్క సీటులోనూ రెండో స్థానానికే పరిమితమైంది. మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యానారాయణ చీపురుపల్లి నుంచి 42,737 ఓట్లు సాధించారు. ఆంధ్రలో కాంగ్రెస్ తరపున ఆయనదే అత్యధిక స్కోరు!
చాలా చోట్ల కాంగ్రెస్ సాధించిన ఓట్లు నాలుగంకెలు కూడా దాటలేదు. ప్రకాశం జిల్లా కందుకూరులో కాంగ్రెస్ అభ్యర్థి రాచగర్ల వెంకట్రావుకు కేవలం 638 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆయనది కాంగ్రెస్ అభ్యర్థుల్లో అత్యల్ప స్కోరు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు... అందరూ పరాజయం పాలయ్యారు. 175 సీట్లలో కేవలం 14 చోట్ల మాత్రమే కాంగ్రెస్ 10 వేల ఓట్లు సంపాదించుకుంది. 5,000 నుంచి 9999 ఓట్లు సాధించింది మరో ఎనిమిది చోట్ల. నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం 30 వేల కన్నా ఎక్కువ ఓట్లు రాబట్టుకున్నారు.