: ప్రముఖుల జయాపజయాలు
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీతో ఢీ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ 3.37లక్షల ఓట్ల తేడాతో మట్టికరిచారు. తనను తాను మోడీకి మించిన నేతగా అంచనా వేసుకుని బోల్తా పడ్డారు. గుజరాత్ లోని వడోదరలో కూడా మోడీ కాంగ్రెస్ నేత మధుసూదన్ పై 5.70లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం నమోదు చేశారు.
గుజరాత్ లోనే మరో లోక్ సభ స్థానం గాంధీ నగర్ నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ 4.83 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ స్థానంలో బీజేపీ సీనియర్ నేత జైట్లీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ చేతిలో 1.02ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గాంధీల కంచుకోట అయిన అమేధీలో రాహుల్ కు బీజేపీ నేత స్మృతి ఇరానీ చెమటలు పట్టించారు. లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచే సీటును... తన ప్రచారం ద్వారా రాహుల్ విజయాన్ని 1.02 లక్షల ఓట్ల మెజారిటీకి పరిమితం చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నీలేకని మీద బెంగళూరు దక్షిణ స్థానంలో బీజేపీ నేత అనంతరకుమార్ 2.29లక్షల ఓట్ల తేడాతో ఏడవ సారి విజయం దక్కించుకున్నారు.