: సుఖమెరుగని, విశ్రమించని యోధుడు
2013 సెప్టెంబర్... తమ పార్టీ తరపున మోడీయే ప్రధాని అభ్యర్థి అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. అద్వానీ లాంటి వారు వ్యతిరేకించారు. మోడీ తన మాయాజాలంతో వారిని ప్రసన్నులను చేసుకున్నారు. కాలచక్రంలో తొమ్మిది నెలలు తిరిగిపోయాయి. మోడీ సారధ్యంలో భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది. ఈ విజయం బీజేపీ చరిత్రలోనే రికార్డు.
ఇదెలా సాధ్యమైంది అంటే..? అది మోడీ కష్టించే తత్వం, విశ్రమించని పట్టుదల. లక్ష్యం సాధించే వరకు వెనుకడుగు వేయని తత్వం. ప్రత్యర్థులను నోటికొచ్చినట్లు మాట్లాడడం కాకుండా, వారిలోని తప్పులను ఓటర్లకు అర్థమయ్యే రీతిలో ఎత్తి చూపగల సమర్థత, మాటల చాతుర్యం. నేతలను తన ఆకర్షణతో కలుపుకుపోగల చాతుర్యం. వ్యూహ నైపుణ్యం వెరసి మోడీకి విజయం దాసోహమైంది.
మిషన్ 272+ ఇది మోడీ లక్ష్యం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లను సొంతంగా గెలుచుకోవడానికి మోడీ గీచిన ప్రణాళిక. దాన్ని చేసి చూపారు. 400 సభలలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నో రోడ్డు షోలు నిర్వహించారు. తొమ్మిది నెలల పాటు ఏ రోజూ విశ్రాంతి అనేది ఎరుగకుండా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు చుట్టొచ్చారు. కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమేయండని పిలుపునిచ్చారు. ఓటర్లు ఆ పని దాదాపుగా చేశారు.
మోడీ కోరుకుంటే కాంగ్రెస్ కార్యాలయం ముందు చాయ్ కొట్టు పెట్టుకోవచ్చని కాంగ్రెస్ నేతలు ఆఫర్ ఇచ్చారు. టీ అమ్ముకున్నోడు ప్రధాని అవుతాడట అంటూ ఎద్దేవా చేశారు. 'అవును నేను టీ అమ్ముకున్నాను. కాంగ్రెస్ నేతల్లా దేశాన్ని అమ్ముకోలేదు' అంటూ మోడీ తిప్పికొట్టారు. చాయ్ పే చర్చ(టీ స్టాల్ నుంచి దేశ వ్యాప్తంగా టీ స్టాళ్ల దగ్గరున్న వారితో మాట్లాడడం) కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్నూప్ గేట్ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ, ఆయన సోదరీమణి ప్రియాంకా గాంధీలు దుష్ప్రచారం చేసినా... భార్య పేరును దాచిపెట్టిన వ్యక్తి దేశాన్ని ఏం పాలిస్తాడని విమర్శలు గుప్పించినా... మోడీ విశ్వసనీయత, అభివృద్ధి నినాదం ముందు అవన్నీ తేలిపోయాయి. దేశంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతను మోడీ చక్కగా బీజేపీ వైపునకు తిప్పుకున్నారు. ట్విట్టర్ ద్వారా ప్రచారంలోనూ ముందున్నారు. సామాజిక, ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం సాగించారు. 'అవును నేను హిందువును. భారతీయుడిని' అని స్పష్టంగా చెప్పుకున్నారు. 'జాతీయతకు పట్టం కట్టండి' అంటూ ప్రత్యర్థుల మతతత్వ ఆరోపణలను తిప్పికొట్టారు. అన్నింటా పైచేయి సాధించారు. ఒక్క వ్యక్తి స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ను అతి తక్కువ స్థానాలకు పరిమితం చేశాడు. అదే మోడీ మహిమ. ఇవే ఆయన విజయ రహస్యాలు!