: జయ, మమతల ముందు ఆ వేవ్ పనిచేయలేదు!
సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవా వీచింది. ఆయన ధాటికి దేశవ్యాప్తంగా ఘనాపాఠీలు సైతం అడ్రస్ లేకుండా పోయారు. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, ఇద్దరు మహిళలు మాత్రం మోడీని దీటుగా ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి ఎవరైనా సరే... తమ ఆధిపత్యానికి తిరుగులేదన్నట్టుగా వీరు ఫలితాలను రాబట్టారు. వీరే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వీరు ప్రభంజనం సృష్టించారు.
తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు గాను ఏఐఏడీఎంకే ఏకంగా 37 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. జయ దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఖాతాను కూడా తెరవలేకపోయింది.
ఇక దీదీ మమత విషయానికొస్తే... సార్వత్రిక ఎన్నికల్లో ఆమె విశ్వరూపమే ప్రదర్శించారు. మొత్తం 42 ఎంపీ స్థానాల్లో ఏకంగా 34 స్థానాల్లో ఆమె విజయదుందుభి మోగించారు. ముస్లింలు అత్యధికంగా ఉండే పశ్చిమ బెంగాల్ లో... మోడీ వ్యతిరేక ఓట్లను రాబట్టడంలో ఆమె పూర్తిగా సఫలీకృతం అయ్యారు. కమ్యూనిస్టుల కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్ లో వారికి కేవలం 2 స్థానాలే దక్కాయి. ఈ ఫలితాలతో కమ్యూనిస్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.