: మోడీకి వీసా ఇవ్వనన్న అమెరికాకు జ్ఞానోదయం అయిందా?


2002 గోద్రా అల్లర్ల తర్వాత మోడీని అంటరాని వాడిగా చూసిన అమెరికాకు బుద్ధి వచ్చేలా భారత ప్రజలు తీర్పునిచ్చారు. మోడీకి వీసా జారీపై 2005లో నిషేధం విధించి అమెరికా తన చిన్న బుద్ధిని చూపించుకుంది. కోర్టులు దోషిగా ప్రకటించి ఉంటే, మోడీని అమెరికా దూరం పెట్టినా అర్థం ఉండేది. భారత న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తిపై తనకు తానుగా నిషేధం విధించి అమెరికా తన ఊసరవెల్లి నీతిని ప్రదర్శించుకుంది.

ప్రపంచ పెద్దన్న పాత్రను తనకు తానుగా ఆపాదించుకుని, వనరులున్న బలహీన దేశాల్లో గద్దలా వాలి తన్నుకుపోయే నైజం అమెరికాది. 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాదుల దాడి తర్వాత అఫ్ఘానిస్థాన్, ఇరాక్ లపై యుద్ధాలకు దిగిన దేశం అమెరికా. అలాంటి నైజం కలిగిన అమెరికా, ఓ ఘటన అనంతరం భావోద్వేగాల కారణంగా జరిగిన అల్లర్లను కారణంగా చూపి మోడీని దూరంగా పెట్టడం ఆ దేశ సంకుచిత, స్వార్థపూరిత విధానాన్ని తెలియజేస్తోంది.

మోడీకి వీసా జారీపై తమ విధానం మారలేదని, ఆయన వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని నిన్నటి వరకూ అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది. మరిప్పుడు, ప్రపంచంలోనే ఒకానొక బలమైన ఆర్థిక, వర్ధమాన దేశానికి మోడీ ప్రధాని కాబోతున్నారు. అలాంటి వ్యక్తికి అమెరికా వీసా కోసం ఎదురు చూడాల్సిన అవసరం కానీ, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కానీ లేదేమో.

మోడీ ప్రధాని కావడం తేలిపోయిన వెంటనే ఒబామా అమెరికాకు రండి అంటూ ఆహ్వానించేశారు. మోడీ విషయంలో ఆ దేశ విధానం అంతలోనే మారిపోయిందా? మోడీని భారత ప్రభుత్వ అధినేతగా అమెరికా ఆహ్వానించిందని, ఆయన ఏ1 వీసాకు అర్హులని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ పాస్కి తెలిపారు. అమెరికాకు వచ్చే ప్రభుత్వాధినేతలకు ఈ వీసా మంజూరు చేస్తుంటారు. నచ్చింది రంభ, నచ్చకపోతే శత్రువు అన్నట్లుగా ఉంటుంది ఆ దేశం తీరు. అలా అనడానికి ఇదే నిదర్శనం.

  • Loading...

More Telugu News