: ఆరు నెలలకే నటి రమ్యను మాజీ చేసిన ఓటర్లు
కర్ణాటక మండ్య లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసిన కన్నడ సినీ నటి రమ్యను... ఓటర్లు తిరస్కరించారు. ఎంపీగా గెలిచి ఆరు నెలలు కూడా తిరగక ముందే ఆమెను సాగనంపారు. తన వ్యవహారశైలి, దూకుడుతనమే ఆమె పాలిట శాపాలుగా మారాయి. కన్నడ నటుడు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ కూడా ఆమె ప్రవర్తన పట్ల విసుగు చెందినట్టు సమాచారం. దీనికి తోడు, కీలక సమయంలో చికిత్స నిమిత్తం అంబరీష్ సింగపూర్ లో ఉండటం కూడా రమ్యకు ప్రతికూలంగా పరిణమించింది. తాను పదవిని చేపట్టి కొన్ని నెలలే అయిందని... మరోసారి అవకాశం ఇస్తే సమస్యలను పరిష్కరిస్తానన్న రమ్య హామీలను ప్రజలు పట్టించుకోలేదు. గతంలో నటనకు స్వస్తి చెబుతానన్న రమ్య... ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుంటుందేమో చూడాలి.