: ఇనుప కండలూ.. ఉక్కు నరాలూ..!


'టెర్మినేటర్-2 ద జడ్జిమెంట్ డే' సినిమా చూసిన వారెవరికైనా అందులో హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ పాత్ర చాలా బాగా గుర్తుండిపోతుంది. శరీరం లోపల యంత్ర భాగాలు.. శరీరంపైన మానవ చర్మం, దానికింద కండరాలు.. మెదడులో కంప్యూటర్ చిప్.. నరాలపై కృత్రిమ మేధస్సు అజమాయిషీ.. ఇలా ఉంటుంది అతని దేహ నిర్మాణం. ఈ అడ్వాన్స్డ్ లక్షణాల సాయంతో హీరో అద్భుత శక్తియుక్తులను ప్రదర్శించడం అప్పట్లో ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి కారణమైంది.

అందులో హీరో పాత్ర సగం మనిషి సగం యంత్రం.. అంటే 'సైబోర్గ్' అన్నమాట. ఇప్పుడీ సైబోర్గ్ లను వాస్తవ ప్రపంచంలోనూ సృష్టించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రష్యా మిలియనీర్ దిమిత్రి ఇత్సుకోవ్ (32) ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2045 కల్లా ఈ మ్యాన్ మెషీన్లను రూపొందించాలని ఆయన కంకణం కట్టుకున్నాడట. ఈ క్రమంలో 30 మంది శాస్త్రవేత్తలను కూడా తన ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నాడు.

ఈ ప్రాజెక్టును నాలుగు దశల్లో నిర్వహిస్తారు. తొలుత  2020 నాటికి మనిషి తన యంత్ర ప్రతిరూపాలను నియంత్రించగలిగేలా పరిజ్ఞానం అభివృద్ధి చేస్తారు. తర్వాతి దశలో 2025 నాటికి రోబోకు మానవ మస్తిష్కాన్ని అమర్చుతారు. 2035 నాటికి అంటే మూడోదశలో రోబోలో ఇమిడ్చిన మనిషి మెదడులోని సమాచారాన్ని కృత్రిమ మెదడులోకి పంపుతారు. దీంతో సైబోర్గ్ ను రూపొందించే ప్రక్రియ పూర్తయినట్టే.

ఇక చివరగా సైబోర్గ్ కు రూపమనేదే లేకుండా చేసి పూర్తిగా విద్యుత్ సమాచార రూపంలోకి మార్చేస్తారు. ఈ కీలక దశ 2045 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో హాలోగ్రామ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారు. దీంతో, తాత్కాలికంగా మానవ రూపాన్ని ధరించడానికి వీలు కలుగుతుందట. అంతేగాకుండా, ఈ విప్లవాత్మక మ్యాన్-మెషీన్లు క్షణ కాలంలో మాయం కావడంతో పాటు.. ప్రపంచంలో ఎక్కడికైనా నిమిషాల్లో చేరుకోగలిగే శక్తిని సంతరించుకుంటాయని తెలుస్తోంది.

అన్నట్టు ఈ సైబోర్గ్ లకు మరణం ఉండదట. ఇంకేం, మనం కూడా ఓ సైబోర్గ్ లా మారిపోతే ఎంత బావుంటుందో అనుకుంటున్నారా..? అయితే, ఆ పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చేందుకు ఇంకా 32 ఏళ్ళ సమయం ఉంది బాసూ..! అప్పటి వరకూ ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News