: క్రికెట్ స్టేడియానికి రాయితీపై నీళ్ళు.. రైతులకు కడగళ్ళు
ఓవైపు మహారాష్ట్రలో, గత నలభై ఏళ్ళలో ఎన్నడూ చవిచూడని రీతిలో కరవు కరాళ నృత్యం చేస్తుంటే.. మరోవైపు, సర్కారు.. క్రికెట్ స్టేడియాల్లో పచ్చగడ్డిని తడిపేందుకు నీటిని రాయితీపై అందించడం వివాదాస్పదమైంది. ఐపీఎల్ ఆరవ సీజన్ సందర్భంగా ముంబయిలోని వాంఖెడే మైదానంలోని పచ్చిక తడిపేందుకు అవసరమైన నీటిని ట్యాంకర్ ఒక్కింటికి రూ. 400 కే సరఫరా చేస్తున్నారట. అదే పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు నానాపాట్లూ పడుతున్న రైతులకైతే ట్యాంకరుకు రూ. 1500 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాంఖెడే స్టేడియంలో పచ్చిక ఎండిపోకుండా పరిరక్షించాలంటే రోజుకు 25,000-26,000 లీటర్ల నీరు అవసరం అవుతాయి. ముంబయితో పాటు పుణే కూడా పలు ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ లను వేరే వేదికలకు తరలించాలని విపక్షాలు ఎలుగెత్తాయి.
'లక్షలాది రైతులు నీటి కోసం అలమటిస్తుంటే, ఐపీఎల్ మ్యాచ్ ల కోసం నీటిని వృధా చేయడం సబబంటారా?' అని బీజేపీ సీనియర్ నేత వినోద్ త్వాడే ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లాకు ఓ లేఖాస్త్రం సంధించారు. ఇవే కారణాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, శివసేన తదితర పార్టీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కరవు కోరల్లో చిక్కుకున్న మరాఠీ ప్రజల కోసం ఐపీఎల్ తన లాభాల నుంచి రూ. 500 కోట్లు ఇవ్వాలని శివసేన గతవారం డిమాండ్ చేసింది.