: సాహస బాలిక మలాలాపై చిత్రం.. భారత్ లో షూటింగ్..


తాలిబాన్ల దురాగతాలను ధైర్యంగా ప్రశ్నించినందుకు, దుండగులు దాడికి తెగబడ్డా, స్థైర్యం వీడని పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ ఉదంతంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాకిస్తాన్ నిర్మాత అంజాద్ ఖాన్ ఈ చిత్రం బాధ్యతలు తలకెత్తుకున్నారు. అయితే, ఈ సినిమా చిత్రీకరణను భారత్ లో జరపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ మేరకు కాన్పూర్ అయితే షూటింగ్ కు అనువుగా ఉంటుందని అంజాద్ భావిస్తున్నాడట. అందరు టీనేజి పిల్లల్లా కాకుండా పాక్ లో బాలికల విద్యా హక్కు పట్ల ఎలుగెత్తడమే మలాలాపై తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఆగ్రహానికి కారణమైంది. తదనంతర పరిణామాల్లో ఆమెపై ఉగ్రదాడి జరగడం, ఆమె చావుతో పోరాడి మళ్ళీ బడిబాట పట్టడం వరకు సంచలనమే.

ఇప్పుడీ బాలిక జీవితాన్ని తెరకెక్కించాలనుకుంటున్న అంజాద్ ఖాన్ పై గతంలో పాక్ లో ఫత్వా విధించారు. అప్పట్లో ఆయన 'లే గయా సద్దామ్' అనే చిత్రాన్ని నిర్మించి ఛాందస వాదుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, 'లే గయా..' చిత్రంలో ఆఫ్గాన్ అతివాది పాత్రలో నటించిన కాన్పూర్ కు చెందిన షాబాజ్ బాజ్వా.. అంజాద్ ఖాన్ తదుపరి చిత్రం షూటింగ్ కోసం కాన్పూర్ ను ఎంచుకున్నట్టు తెలిపాడు.

మలాలాపై చిత్రం విషయమై నేరుగా అంజాద్ ఖాన్ ను సంప్రదించగా, వయసుతో నిమిత్తం లేకుండా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు తనను ఆకట్టుకున్నాయని వివరించాడు. ఈ చిత్రంతో ఆమెకు నీరాజనాలు అర్పించనున్నట్టు చెప్పాడు. ఈ సినిమాలో ప్రఖ్యాత బాలీవుడ్ నటులు డానీ డెంజొప్ప, నసీరుద్దీన్ షా, ఓం పురి, సీమా బిశ్వాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని పాక్ నిర్మాత వెల్లడించారు. అయితే, మలాలా పాత్రలో నటించే బాలిక ఎవరన్నది తెలిపేందుకు ఆయన నిరాకరించారు. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ ను మలాలా పాఠశాలకు అందిస్తామని అంజాద్ ఖాన్ చెప్పారు. 

  • Loading...

More Telugu News