: 70 శాతం వైద్యం ప్రైవేటు చేతుల్లోనే ఉంది: ఎయిమ్స్ వైద్యురాలు
భారతదేశంలో వైద్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రైవేటు రంగం కబంధ హస్తాల్లో ఇది చిక్కుకుపోయింది. దీనిపై ప్రభుత్వ వైద్యులు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం దున్నపోతుమీద వానపడ్డ చందంగా పట్టించుకోవడం మానేశాయి. పథకాల పేరిట 5 శాతం వైద్యం అందిస్తే చాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయని ఎయిమ్స్ వైద్యురాలు ఎంవీ పద్మా శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, 70 శాతం వైద్యరంగం అంతా ప్రైవేటు సంస్థల చేతుల్లోనే ఉందని అన్నారు.
కేవలం 30 శాతం వైద్యసేవలు మాత్రమే ప్రభుత్వ రంగం అధీనంలో ప్రజలకు అందుతున్నాయని ఆమె మండిపడ్డారు. నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని, వైద్య ఖర్చులు అమాంతం పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్యం అందించే విషయంలో మన ప్రభుత్వ విధానాలు సమూలంగా మారాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆరోగ్యం అనేది విలాసం కాదని, ప్రతి ఒక్కరికీ అవసరమని, అందువల్ల అది ప్రభుత్వ బాధ్యత అని ఆమె అన్నారు.