: కాదేదీ కల్తీ కనర్హం... చంటిపిల్లలు తాగే పాలైనా సరే....!
కాదేదీ కల్తీ కనర్హం..! అంటూ డబ్బు కోసం ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేందుకు సైతం అక్రమార్కులు నడుంబిగిస్తున్నారు. దీని పర్యవసానం ఎందరో అమాయకులైన చిన్నారులను, పెద్దలను రోగాలపాలు చేస్తుందని తెలిసినా, డబ్బే పరమావధిగా నయవంచనకు తెగబడుతున్నారు. తినే, తాగే వస్తువులు సైతం కల్తీ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
ఇందులో భాగమైన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తోన్న మరో ముఠా బాగోతం బయటపడింది. నగరంలో కల్తీ పాలు తయారుచేసి విక్రయిస్తోన్న ముఠాను చిక్కడపల్లి పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. వీరంతా జవహర్ నగర్, దోమల్ గూడ, గాంధీ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు విక్రయిస్తున్నట్టు పోలీసు విచారణలో కనుగొన్నారు. ఇంతకు ముందు కూడా కల్తీపాల వ్యవహారంలో కొందరిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే.