: గ్రామీణులు, రైతులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి మండలపరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన గ్రామీణులు, రైతులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వాగతిస్తూ, సీమాంధ్రలో 2/3 మెజార్టీ సాధించి పెట్టిన ప్రజలకు శతకోటి వందనాలు తెలిపారు.
"మీరు చూపిన ఆదరణ చరిత్రాత్మకం, ఇది నవశకానికి నాంది" అని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ సహా ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 20 శాతం వరకు మండలపరిషత్ స్థానాలను గెలుచుకున్నామని, అక్కడి ప్రజలు తమను ఆదరించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులైన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.