: బ్యాలెట్ విధానం వల్ల కౌంటింగ్ ఆలస్యం: రమాకాంత్ రెడ్డి
తెలంగాణ, సీమాంధ్రలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ప్రారంభమైందని, అయితే ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరగడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బ్యాలెట్ బాక్సుల్లో రెండు రంగుల పేపర్లు ఉంటాయని, ఒకటి తెలుపు, రెండోది గులాబీ రంగు అని, ఆ రెండింటినీ వేరుచేయాలని చెప్పారు. ఆ తరువాత 25 చొప్పున వాటికి కట్ట కట్టి, వేరే ట్రేలలో పెట్టి లెక్కించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుందని, ఆ తర్వాత కౌంటింగ్ చేయడం జరుగుతుందని రమాకాంత్ రెడ్డి చెప్పారు.
జెడ్పీటీసీ మాత్రం కౌంటింగ్ చేసేటప్పుడు ఓడిపోయిన-గెలిచిన అభ్యర్థికి మధ్య 1500, అంతకంటే ఎక్కువ తేడా ఉంటే లెక్కించనవసరం లేదని, డిక్లేర్ చేయవచ్చునని ఆయన చెప్పారు. అంతకంటే తక్కువ ఉంటే అక్కడ రీ కౌంటింగ్ జరుగుతుందని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా, పెద్దపూడిలో రెండు పోలింగ్ కేంద్రాల్లో వర్షం వల్ల రెండు బ్యాలెట్ బాక్సులు తడిసిపోయాయని, వాటిని ఎండలో ఆరబెట్టి చూడగా 4 పేపర్లు మాత్రమే పూర్తిగా పాడయ్యాయని, అయితే వాటిని అభ్యర్థులకు చూపించిన తర్వాత వారి అంగీకారంతో కౌంటింగ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.