: అప్పుడు ప్రేమ...ఇప్పుడు డబ్బు
తాను వెంటపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడో ప్రబుద్ధుడు. కట్నం కోసమే గెంటేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా... కేసు వాపస్ తీసుకోకుంటే యాసిడ్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు భర్త. ఒడిశాకు చెందిన మహేష్ ప్రసాద్ కుమార్తె ఎస్. నేహరాజ్ (27)ను హైదరాబాదు, ఖైరతాబాద్‌కు చెందిన సందీప్‌రాజ్ 2010 ఏప్రిల్ 21న ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. సందీప్ ప్రస్తుతం విజయవాడలోని ఎయిర్కోస్టా కాల్సెంటర్లో పని చేస్తున్నాడు. పెళ్లైననాటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధిస్తున్నాడు.
అతనికి ఆమె అత్తమామలు సుగుణ, బాల్‌సుందర్, మరదలు రీనారాజ్, స్నేహితుడు ఇలియాస్ వంత పాడుతూ, వేధింపులకు గురిచేసేవారు. నెల రోజుల క్రితం ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు పెట్టడంతో మండిపడ్డ సందీప్, కేసు ఉపసంహరించుకుని ఒడిశాకు వెళ్లిపోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు భర్తపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సందీప్ విజయవాడలో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది.