: అవినీతిపరులకు తెలుగు ప్రజలు గుణపాఠం చెప్పారు: చంద్రబాబు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయాన్ని సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు చాలా విజ్ఞతతో వ్యవహరించారని... అవినీతిపరులకు గుణపాఠం నేర్పారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసం ఉంచిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్రను కేవలం టీడీపీ మాత్రమే అభివృద్ధి చేయగలదన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు. పదేళ్ల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలకు తెలుగు ప్రజలు ముగింపు పలికారని అన్నారు. ప్రత్యర్థులు ఎన్నో విధాలుగా పలోభపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ... ప్రజలు లొంగలేదని చెప్పారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని... వైకాపాకు అనేక స్థానాల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందనే సెంటిమెంట్ ఉందని... అందువల్లే తెలంగాణలో మెజారిటీ స్థానాలు దక్కలేదని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయమని... రాష్ట అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.