: సీమాంధ్ర రాజధానిగా వీటికి అవకాశం
సీమాంధ్ర రాజధానిగా ఏ ప్రాంతం అనువైనదో కేంద్ర ప్రభుత్వానికి సూచించేందుకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే విశాఖ, రాజమండ్రి నగరాలను చుట్టొచ్చిన ఈ కమిటీ సభ్యులు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలను కూడా సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్లేషకులు సీమాంధ్రకు రాజధాని విజయవాడ-ఏలూరు మధ్య లేదా విజయవాడ-గుంటూరు-ఒంగోలు మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.
విజయవాడ-గుంటూరు మధ్యలో మంగళగిరిలో ప్రభుత్వానికి తగినంత భూమి ఉన్నందున ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్నారు. భూమితోపాటు నాగార్జున యూనివర్సిటీలో సిద్ధంగా ఉన్న భవనాలు నూతన ప్రభుత్వ పాలనకు ఉపకరిస్తాయని చెబుతున్నారు. దగ్గర్లోనే ప్రకాశం బ్యారేజీ ఉన్నందున నీటి సమస్య కూడా ఉండదని పేర్కొంటున్నారు. ఇక విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. మధ్యలో గన్నవరం విమానశ్రయం కూడా ఉండడం, రైల్వే కనెక్టివిటీ... ఇవన్నీ రాజధాని ఏర్పాటుకు సానుకూలతలుగా చెబుతున్నారు.