: పెళ్లి సమయంలోనూ ఆ డాక్టర్ల సేవా తత్పరతకు హ్యాట్సాఫ్
వారిద్దరూ వృత్తిరీత్యా డాక్టర్లు. వారిద్దరూ జీవితాంతం కలిసి అడుగులు వేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, వివాహ సమయంలోనూ వారు చూపిన సేవా తత్పరతను చూసి అభినందించకుండా ఉండలేం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన డాక్టర్ బాలాజీ, డాక్టర్ కైవల్య శుక్రవారం నాడు తమ పెళ్లి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వారి సేవాభావాన్ని అర్థం చేసుకున్న 25 మంది బంధుమిత్రులు కూడా రక్తదానం చేశారు. స్థానిక జేకే గార్డెన్స్ కల్యాణ మంటపంలో జరిగిన ఈ శిబిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు దాతల రక్తాన్ని సేకరించారు. రక్తదానం వంటి పుణ్య కార్యంతో కొత్త జీవితంలోకి అడుగిడిన వధూవరులను మహాలక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి పీఠాధిపతి చిన్న వెంకన్నబాబు ఆశీర్వదించారు.