: ఆ పెళ్లి జరగడానికి వీల్లేదన్న ప్రియురాలు


మరికాసేపట్లో ఆ కల్యాణ మండపంలో పెళ్లి జరగాల్సి ఉండగా... ఆ పెళ్లి జరగడానికి వీల్లేదంటూ ప్రియురాలు భీష్మించుకు కూర్చుంది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలోని పడాల్ పల్లిలో జరిగింది. పడాల్ పల్లి గ్రామ వాసి పంటాల యాదగిరి పెద్ద కుమార్తె శిరీషకు మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన నీల రాములు కుమారుడు శంకర్ తో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కొడుకు శంకర్ బంధువులతో కలిసి పడాల్ పల్లిలోని పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అదే సమయంలో శంకర్ మాజీ ప్రియురాలు విజయ అక్కడకు చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. తనను కాదని పెళ్లి ఎలా చేస్తారంటూ పెద్దలను నిలదీసింది.

శంకర్ గతంలో యావపూర్ గ్రామానికి చెందిన విజయను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడు. దాంతో విజయ గతేడాది ఆగస్టు 5న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శంకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, కేసు విచారణలో ఉంది.

ఈ తంతును చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విజయను స్థానిక ఎస్ఐ పీఎస్ కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. పెళ్లికొడుకు, అతని బందువులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. పెళ్లి కుమార్తె శిరీషకు సమీప బంధువుతో అదే వివాహ వేదికపై శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు పెళ్లి జరిగింది.

  • Loading...

More Telugu News