: ఊసులాడాడు...బాసలు చేశాడు...పత్తా లేకుండా పోయాడు


'నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను' అంటూ ఊసులు చెప్పాడు... మన భవిష్యత్ బంగారం, మనం పెళ్లి చేసుకుందాం అని బాసలు చేశాడు...తీరా ఆ తంతు ముగిసి గర్భవతి అని తెలియగానే పెట్టేబేడా సర్దుకుని ఉడాయించాడు. ఆ వివారాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన ఉప్పరపల్లి రజని (25) పీజీ చదివింది. అదే గ్రామానికి చెందిన పిల్లి శ్రీకాంత్ (28) ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మూడేళ్లుగా వెంటపడ్డాడు.

అతని మాటలు నమ్మిన రజని అతడితో చనువుగా ఉంది. కొంత కాలం తర్వాత తాను గర్భందాల్చినట్టు గుర్తించి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అంటూ అతడ్ని నిలదీసింది. తొందర్లోనే చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చిన శ్రీకాంత్.. ఈనెల ఒకటో తేదీన కుటుంబ సభ్యులతో కలసి ఇంటికి తాళమేసి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన రజని.. న్యాయం కోసం ఈనెల మూడో తేదీన కోహెడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో గత్యంతరం లేక ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల సభ్యులు ఆమెకు మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధిపేట, హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో సీఐ సదన్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రజనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News