: ఐపీఎల్ జట్లలో చోటు కల్పిస్తానంటూ.. రూ. 38 లక్షలకు టోకరా


ఐపీఎల్ పట్ల వీక్షకులే కాదు ఆటగాళ్ళు కూడా గంగవెర్రులెత్తుతారన్న దానికి నిదర్శనం ఈ సంఘటన. అహ్మదాబాద్ కు చెందిన ఐదుగురు వర్థమాన క్రికెటర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో చోటు కల్పిస్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి రూ. 38 లక్షలు వసూలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ లో ఆడాలని కోరిక ఉన్న యువ ఆటగాళ్ళకు ఆహ్వానం అంటూ ఓ వెబ్ సైట్ ప్రకటించడాన్ని అనుమానించిన నగర అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కేఎన్ పటేల్ వెంటనే విచారణకు ఆదేశించడంతో.. తీగ లాగితే డొంక కదిలినట్టయింది.

పలువురు ఆటగాళ్ళ ఆకాంక్షే పెట్టుబడిగా మోసానికి తెగించిన గోహిల్ అనే నయవంచకుడు క్రైమ్ బ్రాంచ్ కు అడ్డంగా దొరికిపోయాడు. గోహిల్ మోసానికి బలైన ఆటగాళ్ళలో ఒకడైన హితేష్ వాఘేలా అనే క్రికెటర్ మాట్లాడుతూ, డెక్కన్ చార్జర్స్ కు తనను ఎంపిక చేసినట్టు గోహిల్ నమ్మబలికాడని తెలిపాడు. అనంతరం కొన్ని ఫొటోలు చూపడంతో పాటు గుజరాత్ వార్తా పత్రికల్లో వచ్చిన అతని ఇంటర్వ్యూ చూపాడని హితేష్ వెల్లడించాడు.

పైగా, డెక్కన్ చార్జర్స్ ఆటగాళ్ళ జాబితాలో పేరు ఉందంటూ ఓ లిస్టు చూపాడని, అందులో తన పేరు కూడా ఉండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని చెప్పాడు. వీటన్నింటని మించి, బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నుంచి అనుమతి కూడా లభించిందని, ఓ లెటర్ చూపడంతో తాను అతన్ని నమ్మి రూ. 7 లక్షలు ఇచ్చానని హితేష్ వాపోయాడు.

కాగా, గోహిల్ చెప్పినదంతా బూటకమని పోలీసుల విచారణలో తేలింది. ఆ ఫొటోలు 2011 సీజన్ సందర్భంగా డెక్కన్ చార్జర్స్ ఆటగాళ్ళు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసినప్పటివని తేల్చారు. ఆ సమయంలో గోహిల్ కూడా అదే హోటల్ లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News