: ఈ ఎంపీ... ఓ బాడీబిల్డర్!
సినీ నటులంటే ఒక రకమైన రూపురేఖలు, పోలీసులంటే మరో రకమైన రూపురేఖలు, రాజకీయ నాయకులంటే ఇంకో రకమైన రూపురేఖలు మనకి ముద్రించుకుపోయాయి. ఇందుకు భిన్నంగా, సంప్రదాయ శైలికి విరుద్ధంగా ఓ ఎంపీ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఉత్తరాఖండ్ నైనిటాల్ సిట్టింగ్ ఎంపీ హరిచంద్ రాజ్ సింగ్ (సింగ్ బాబా) ను కండల ఎంపీగా పిలుస్తారు.
గత రెండు ఎన్నికల్లో ఎంపీగా విజయబావుటా ఎగురవేసిన సింగ్ బాబా వయసు 65 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన రోజుకి గంటన్నర వ్యాయామం చేస్తారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఉన్న సమయంలో కూడా ఆయన రోజూ వ్యాయామం చేయనిదే బయటకు వెళ్లేవారు కాదు.
గతంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గెలుపొందారు. రోజూ 50 కేజీల బరువు ఎత్తకపోతే తనకు ఒళ్లు నొప్పులు వస్తాయని ఆయన తెలిపారు. ఆయన బీజేపీ అభ్యర్థి భగత్ కొషియారితో తలపడుతున్నారు. అయితే ఆయన హ్యాట్రిక్ సాధిస్తారా? లేదా? అనేది 16న తేలిపోతుంది.