: బీజేపీ, టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ కూటమి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిందని, ఇక్కడ ఒక్క సీటు కూడా రాదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. యూపీలో కాంగ్రెస్ నేతలు ఈవీఎంలు పరిశీలించినా, పోలింగ్ సమయంలో రాహుల్ ఈవీఎంను పరిశీలించినా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు.
మోడీ, చంద్రబాబులపై కేసులు పెట్టినప్పుడు మరి కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటని వెంకయ్య ప్రశ్నించారు. వారణాసిలో ప్రచారం చేసుకునేందుకు అభ్యర్థులందరికి అనుమతిచ్చిన ఈసీ మోడీకి మాత్రం ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అనుమతి ఇవ్వకపోవడం రాజ్యాంగ స్పూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. యూపీలోని పార్టీలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని, దేశంలో ఏ మూలకు వెళ్లినా మోడీయే బెస్ట్ అని అందరూ అంటున్నారనీ అన్నారు.