: బస్సు లోయలో పడి 17 మంది మృతి, 21 మందికి తీవ్రగాయాలు
హిమాచల్ ప్రదేశ్ సిమౌర్ జిల్లా పరిధిలోని మైలా గ్రామ సమీపంలో ఇవాళ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ సుమేధా వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోకి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించామని ఆయన తెలిపారు. అనంతరం వారిని మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం పిల్లై ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు.
ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఎస్పీ వెల్లడించారు. బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ సుమేధా వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.