: భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన భారత్ తొలి ఓటరు
భారతదేశ తొలి ఓటరు శ్యామ్ నేగి (97) ఎనిమిదో విడత పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించున్నారు. ఇవాళ శ్యామ్ నేగి కల్పలో భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఇప్పటివరకు 15 లోక్ సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేశారు. శ్యామ్ నేగి ప్రత్యేకత ఏమిటంటే... ఆయనే భారతదేశ తొలి ఓటరు.
1951లో తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన 16 సార్వత్రిక ఎన్నికల్లో శ్యామ్ నేగి ఓటు వేయటం విశేషం. ఎండను, వాననూ.. చలిని సైతం లెక్కచేయక ఆయన ఓటు వేస్తూ ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆయనను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా శ్యామ్ నేగి మీడియాతో మాట్లాడుతూ... 97 ఏళ్ల వయస్సున్న తానే ఓటుహక్కును వినియోగించుకున్నానని, ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు.