: ఆంధ్రప్రదేశే నెంబర్ వన్
సార్వత్రిక ఎన్నికల్లో నగదు, మద్యం పంపకాల్లో మన రాష్ట్రానిదే నెంబర్ వన్ స్థానం. దేశంలో 283 కోట్ల రూపాయలు దొరికితే, అందులో రాష్ట్రంలో రెండు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 131 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి. కాగా, ఎన్నికల్లో అభ్యర్థులు ఏ స్థాయిలో అవకతవకలకు పాల్పడుతున్నారన్నది పట్టుబడిన డబ్బును చూస్తే తెలుస్తుంది.
నగదు పంపిణీలో మాత్రమే కాదు. మద్యం పంపిణీలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం. దేశం మొత్తం మీద 2.13 కోట్ల లీటర్ల మద్యం పట్టుబడితే, ఆంధ్రప్రదేశ్ లో కోటి లీటర్ల మధ్యం పట్టుబడింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యథాశక్తి అభ్యర్థులు ప్రయత్నించారు. కాగా పట్టుబడిన డబ్బే ఈ స్థాయిలో ఉంటే...మరి పట్టుబడనిది ఎంత?.
ఈ లెక్కన ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థికి ఎంత ఖర్చైంది అనేది దేవుడికే తెలియాలి. ఎన్నికల అఫిడవిట్లో డబ్బు పేర్కొన్నా అది పేపర్లకే పరిమితమవుతోందని ఎన్నికల కమిషన్ వెల్లడించిన లెక్కలు నిర్ధారిస్తున్నాయి.