: ఏలియన్స్ సహా అన్నీ మనలోనే ఉన్నాయిష!
'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!' అంటూ మన గురజాడ వారి లుబ్ధావధాన్లు సెలవిచ్చారు గానీ.. ఆధునిక శాస్త్రవేత్తలు 'ఏలియన్స్- గ్రహాంతర జీవులకు సంబంధించిన ఆనవాళ్లు కూడా మన శరీరాల్లోనే ఉంటాయంటూ' నవీన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. పరమాత్ముడికోసం మనం బాహ్యప్రపంచంలో వెతుకుతుంటాం గానీ.. మనలోనే ఉంటాడనే తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించే.. ఆధ్యాత్మిక సిద్ధాంతంలాగా ఉన్నది కదూ ఇది!
వివరాల్లోకి వెళితే...
కజక్‌స్తాన్‌లోని అల్‌ఫరాబి కజక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త వ్లాదిమీర్ ఐష్‌చెర్‌బక్ చేసిన పరిశోధనల్లో ఒక విషయం నిగ్గు తేల్చారు. భూమి మీది మానవ జాతి కంటె కొన్ని వందల కోట్ల ఏళ్ల ముందే ఆవిర్భవించిన, మానవులకంటె తెలివైన .. ఇతర గ్రహాల వాసులు తమ ముద్రను మనలో వదిలిపెట్టారట. దీన్ని తొలగించడం కూడా సాధ్యం కాదట. ఆయనతోపాటు ఫెసెంకోవ్, మకుకోవ్ కూడా ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. అయితే ఇది మేథమేటికల్‌గా నిరూపణ అవుతుందే తప్ప, డార్విన్ పరిణామ థియరీ ప్రకారం తేలేది కాదని వారు మెలికపెట్టడం గమనార్హం.