: ఆ విమానంలో ప్రయాణిస్తే సకల సౌకర్యాలు పొందవచ్చు!
ఇప్పుడు విమానయాన సంస్థలు ఉన్నతవర్గాల వారి కోసం సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాకపోతే అందుకు కాస్త డబ్బులు ఎక్కువ వసూలు చేస్తాయి. మధ్య ప్రాచ్య ప్రాంతానికి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్ ఇప్పుడు ‘ఖరీదైన’ ప్రయాణికుల కోసం సరికొత్త సౌకర్యాలను అందించేందుకు ముందుకొచ్చింది. అయితే, ఈ ఏర్పాట్లన్నీ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించే వారికే సుమా! ఎ-380 విమానంలో స్పెషల్ ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఓ చిన్నపాటి సూట్ ను ఏర్పాటు చేసిందీ ఎయిర్ వేస్.
ఈ సూట్ లో ఓ పడక గదితో పాటు ప్రైవేటు స్నానాల గది, అందులో షవర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రకటించింది. అంతేకాదు, అక్కడ ఓ బట్లర్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పింది. తమ డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ ఎ-380 విమానాల్లో ఈ సదుపాయం డిసెంబరు నెల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ప్రకటించింది.