: జగన్.. దోచుకున్నది చాలదా? అధికారం లేకపోతే చచ్చిపోతారా?: పవన్ కల్యాణ్
2004 తర్వాత అవినీతి, దోపిడీ విపరీతంగా పెరిగిపోయాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ డిమాండ్ ఊపందుకోలేదని... వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే విభజన వాదం ఎక్కువైందని తెలిపారు. జగన్ అధికార దాహంతో ఆ వాదం మరింత బలపడిందని చెప్పారు. వైఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైఎస్ అవినీతి అప్పట్లో ప్రజలకు అర్థం కాలేదని చెప్పారు. దోచుకున్న వేల కోట్ల రూపాయలు చాలవా? అధికారం లేకపోతే చచ్చిపోతారా? అంటూ జగన్ ను నిలదీశారు. కృష్ణా జిల్లా కైకలూరులో ఈ రోజు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పించలేని జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీ, టీడీపీలకు జనసేన మద్దతు పలికిందని చెప్పారు.