: 'బ్లడ్ 4 ఇండియా' మొబైల్ అప్లికేషన్ ను ఆవిష్కరించిన తొగాడియా
విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా 'బ్లడ్ 4 ఇండియా' అనే మొబైల్ అప్లికేషన్ ను విడుదల చేశారు. అత్యవసరంగా రక్తం కావాల్సిన వారు ఈ అప్లికేషన్ సాయంతో దాతలను సత్వరమే వెతుక్కోవచ్చు. ఈ అప్లికేషన్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విడుదల చేసిన అనంతరం తొగాడియా మాట్లాడుతూ రక్తదాతలు, రక్తం అవసరమైన వారి మధ్య అనుసంధానంగా ఇది పనిచేస్తుందన్నారు.
ఈ అప్లికేషన్ ను స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుని దానం చేయాలనుకునేవారు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. అలాగే, రక్తం కావాల్సిన వారు కూడా వారి వివరాలు నమోదు చేసుకుని దాతల వివరాలు వెతుక్కోవచ్చని పేర్కొన్నారు. మనం ఉన్న ప్రాంతానికి సమీపంలో ఎక్కడ దాతలు ఉన్నారు? ఫలానా గ్రూపు రక్తం అందుబాటులో ఉందా? అన్న వివరాలను కూడా దీని సాయంతో తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. తొగాడియా నిజానికి ఒక కేన్సర్ సర్జన్. ఈ అప్లికేషన్ ను రూపొందించిన ఇండియా హెల్త్ లైన్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.