: మీరూ ఓ ఐపీఎల్ టీమ్ ని చేజక్కించుకోవచ్చు..!


టీ20 క్రికెట్ విందు ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది జట్లు దాదాపు రెండు నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సై అంటున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ ఖాయమని గత అంచె ఐపీఎల్ పోటీలు హామీ ఇస్తున్నాయి. కాగా, తాజా సీజన్ సందర్భంగా నెట్ వీక్షకుల కోసం ఐపీఎల్ యాజమాన్యం సరికొత్త ఫాంటసీ లీగ్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో, ఫ్యాన్స్ తమ సొంత ఐపీఎల్ ఫ్రాంచైజీని చేజక్కించుకోవచ్చు.

ఎలాగంటే, ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్లోకి ప్రవేశించగానే, అక్కడ ఫాంటసీ లీగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పది మిలియన్ డాలర్ల ఫాంటసీ కరెన్సీ దర్శనమిస్తుంది. ఆ మొత్తంతో మనకు కావాల్సిన ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు. బ్యాట్స్ మెన్, బౌలర్లు, వికెట్ కీపర్, ఆల్ రౌండర్లు.. ఇలా వివిధ జాబితాల నుంచి జట్టును ఎంపిక చేసుకోవాలి. దీంతో, మనకో వర్చువల్ టీమ్ తయారైందన్నమాట.

మనం ఎంపిక చేసుకున్న ఆటగాళ్ళు ఐపీఎల్ లో కనబరిచే వాస్తవ ప్రదర్శన ఆధారంగా ఫాంటసీ లీగ్ లో పాయింట్లు కేటాయిస్తారు. వారు చేసే పరుగులు, పట్టే క్యాచ్ లు, పడగొట్టే వికెట్లు, రనౌట్లు వంటి ప్రదర్శనలకు కొన్ని పాయింట్లు ప్రదానం చేస్తారు. ఐపీఎల్ లీగ్ దశలో ఇలా ఎవరి టీమ్ కు ఎక్కువ పాయింట్లు దక్కుతాయో వారు ఫాంటసీ లీగ్ విజేతగా నిలుస్తారు. వారికి ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లు, వస్తు సామగ్రి బహుమతిగా ఇస్తారు. కాగా, తమ ఫాంటసీ జట్టు పేరు, జట్టు లోగోలను పోటీదారులు ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. 

  • Loading...

More Telugu News