: వైఎస్సార్ కాంగ్రెస్ హఠావో... సీమాంధ్ర బచావో: పవన్ కల్యాణ్
సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత దేశాన్ని ఏకం చేయగలిగే నాయకుడు మోడీ ఒక్కరేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరంలో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతోన్న 'భారత్ విజయ్' బహిరంగసభలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఓట్లు చీల్చడం ఇష్టం లేకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. దేశాభివృద్ధి కోసమే టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్దతునిస్తోందని పవన్ పునరుద్ఘాటించారు.
గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్లు గోదావరి జిల్లాల్లోనే ఉన్నారు. కరీంనగర్ లో ఉండేవాళ్లు అక్కడే ఉన్నారు. కానీ కేసీఆర్ 'వీళ్లు వెళ్లి అక్కడ దోచుకుంటున్నార'ని ప్రచారం చేశారు. ఇలాంటి రాజకీయాల వల్లే తెలుగువారి మధ్య విద్వేషాలు పెరిగిపోయాయి. రాష్ట్రం విడిపోతే దోచుకుందామన్న ఆశ కేసీఆర్, జగన్ ది. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్లు జగన్ కు రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి కావాలని ఉంది. అందుకే కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాన్ని వాళ్ల స్వార్థం కోసమే విభజించారని పవన్ కల్యాణ్ చెప్పారు.
విభజన విధానం సరిగా లేక ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారం కోసం కాదని, ప్రజల మేలు కోసమే జనసేన పార్టీని స్థాపించినట్లు ఆయన చెప్పారు. చంద్రబాబు తనకు బంధువు కాదు, మిత్రుడు కాదన్నారు. కేవలం రాష్ట్రం అభివృద్ధి కోసమే టీడీపీకి మద్దతిస్తున్నానని అన్నారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగం చివరిలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ హఠావో... సీమాంధ్ర బచావో’ అని నినదించారు.