: తెలంగాణలో మావోయిస్టులు దాడి చేసే అవకాశం: నిఘా వర్గాలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులు విధ్వంసానికి దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్ బృందాలు సంచరిస్తున్నాయంటూ... ఈ మూడు జిల్లాల పోలీసులను డీజీపీ అప్రమత్తం చేశారు. ఈ జిల్లాల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దాడులకు సంబంధించి తమకు స్పష్టమైన సమాచారం ఉందని డీజీపీ చెప్పారు. మావోలను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ స్పష్టం చేశారు.