: ఎంపీ రాజయ్యా... ఇదేందయ్యా?
వరంగల్ ఎంపీ రాజయ్య ఇంటి గొడవలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఆయన కోడలు సారిక సికింద్రాబాదు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో రాజయ్యతో పాటు, ఆయన కుటుంబంపై వేధింపుల కేసు పెట్టారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడు అనిల్, ఇతర కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టులో సారిక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నాంపల్లి ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో బేగంపేట మహిళా పీఎస్ లో కేసు నమోదైంది.
2006వ సంవత్సరంలో రాజయ్య కుమారుడు అనిల్ తో సారికకు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే, ఇటీవలి కాలంలో అనిల్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని సారిక ఆరోపిస్తున్నారు. దీనికి తోడు, అనిల్ కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా సారిక చెబుతున్నారు. పెళ్లైన తరువాత తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశానని, ఆ ఉద్యోగం తాలూకు జీతం డబ్బులు కూడా తాను ఇంట్లోనే ఇచ్చానని సారిక చెప్పారు. కానీ, ఇప్పుడు తన పిల్లలకు పాల డబ్బా కొనేందుకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని సారిక మీడియాతో చెప్పారు.