: ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే దూసుకుపోతున్న నేతలు
తెలంగాణలో ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దాంతో వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. చివరి రోజు కావడంతో ఇవాళ్టి ప్రచార షెడ్యూల్ ను పక్కాగా రూపొందించుకుని... సుడిగాలి పర్యటనల్లో తలమునకలై ఉన్నారు. ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఎవరికి వారే తమదైన శైలిలో పోటీపడి మరీ ప్రచారాన్ని చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మెదక్ జిల్లా గజ్వేల్ లో జరిగే బహిరంగసభలో పవన్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంతో గజ్వేల్ పై బాబు ప్రధానంగా దృష్టి పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గజ్వేల్ తో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు విపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జై సమైక్యాంధ్ర పార్టీ, వైఎస్సార్సీపీ, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున ఆయా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.