: అవినీతి నేతలను ఏరి పారేస్తా: నరేంద్ర మోడీ


అవినీతి నేతలను, నేర చరితులను ఏరి పారేస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. రాజకీయ అవినీతిని పెకిలించి వేస్తానని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల బరిలో ఒక్క అవినీతిపరుడు కూడా ఉండడు అని మోడీ స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రజల ముందుంచారు. "మా యాక్షన్ ప్లాన్ లో భాగంగా ముందుగా సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దృష్టి కేంద్రీకరిస్తాం. ముందుగా కేసులున్న ప్రజాప్రతినిధులపై నమోదైన అవినీతి కేసులను విచారించేందుకు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును కోరతాం. ఒక్క ఏడాదిలోగా ఆయా కేసుల్లో తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేస్తాం. వాటిలో క్లీన్ చిట్ వస్తే ఆయా ప్రజాప్రతినిధులు అబియోగాల నుంచి బయటపడతారు. ఒకవేళ కోర్టు దోషిగా నిర్థారిస్తే వారికి శిక్ష తప్పదు" అని ఆయన అన్నారు.

ఇలా చేయడం వల్ల అవినీతిపరులెవరో తేలిపోతుందని, అవినీతిపరులైన ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని చెప్పారు. వారి స్థానంలో నిజాయతీపరులను, సచ్చీలురను ఎన్నికల్లో నిలబెడతామని ఆయన అన్నారు. ఈ విధంగా తొలుత ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఉన్న అవినీతిపరులను ఏరివేస్తామని, తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీరాజ్ సంస్థల్లో రాజకీయ నేతల పని పడతామని ఆయన వివరించారు. ఈ విధంగా 2019 ఎన్నికల కల్లా అవినీతి రహిత రాజకీయ వ్యవస్థను ఏర్పాటయ్యే విధంగా చూస్తానని మోడీ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News