: ఓడ విషాదానికి బాధ్యతగా దక్షిణ కొరియా ప్రధాని రాజీనామా
దక్షిణ కొరియా చరిత్రలో ఒకానొక అదిపెద్ద మానవ విషాదంగా పరిణమించిన నౌక ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని చుంగ్ హాంగ్ వాన్ రాజీనామా చేశారు. ఈ నెల 16న పసుపు సముద్రంలో విద్యార్థులతో వెళుతున్న నౌక భారీ ప్రమాదానికి గురై మునిగిపోయిన విషయం తెలిసిందే. నౌకలో 476 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఎక్కువ మంది విద్యార్థులే. ప్రమాదం అనంతరం 300 మంది వరకూ ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకూ 187 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో గాలింపు చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు వాన్ ఈ రోజు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా నిరోధించలేకపోవడంతోపాటు, ప్రమాదానంతరం సరిగ్గా స్పందించనందుకు క్షమాపణలు కోరారు. ప్రధానిగా ఈ ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలని నమ్ముతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.