: కేసీఆర్! నీ తాట తీస్తా: పవన్ కల్యాణ్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్! నీ తాట తీస్తా. నీ దురహంకారంతో దేశానికి కాబోయే మొదటి బీసీ ప్రధానిని నిందిస్తే చూస్తూ ఊరుకోం...వరంగల్ నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా’’ అంటూ పవన్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఆవేశంతో హెచ్చరించారు. కేసీఆర్ తనను తిట్టినా భరిస్తానని, అంతేకాని మోడీని తిడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని పవన్ స్పష్టం చేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి బయటపెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే కేసీఆర్ లాంటి వాళ్లు మనకొద్దని ఆయన అన్నారు. మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా పోటీ చేస్తే దాడులు చేస్తారా? అని కేసీఆర్ ను పవన్ కల్యాణ్ నిలదీశారు. "బూతులు తిడితే కేసీఆర్ కు వచ్చే కిక్కే వేరప్పా" అని 'అత్తారింటికి దారేది' సినిమా స్టయిల్ లో అన్నారు పవన్. తాను మద్దతిచ్చిన నేతలు ప్రజా సమస్యలు పట్టించుకునేలా చూస్తానని పవన్ తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు.