: ఇక్కడ్నుంచి గెలిస్తే మంత్రి పదవి ఖాయం?
క్రీడలు, సినిమాలు, రాజకీయాల్లో చాలా సెంటిమెంట్లు రాజ్యమేలుతుంటాయి. నరసరావుపేట నియోజకవర్గంలో కూడా అలాంటి సెంటిమెంటే ఒకటి చాలాకాలంగా రాజ్యమేలుతోంది. గతంలో చాలా సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తులు మంత్రులుగా పదవులు అలంకరించారు. అదే సెంటిమెంటు ప్రకారం ఇక్కడ్నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని మంత్రి పదవి వరిస్తుందనే ఉహాగానాలు ఊపందుకున్నాయి.
కాగా ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే బరిలో ఉండడం విశేషం. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోడెల శివప్రసాద్, కాసు వెంకటకృష్ణారెడ్డి మంత్రి పదవులు అలంకరించారు.
ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీలుగా పోటీ చేసిన తరువాత వేరే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థులుగా గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కొణిజేటి రోశయ్యలు కూడా ముఖ్యమంత్రులుగా పదవులు అలంకరించారు. దీంతో ఈసారి పదవీ యోగం ఎవరిని వరించనుందోనని ఉత్సుకత పెరిగిపోతోంది. అభ్యర్థులు ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.