: శృతిమించిన రాందేవ్ బాబా వ్యాఖ్యలు!
యోగా గురువు బాబా రాందేవ్ మాటలు శృతిమించాయి. నిన్న (శుక్రవారం) లక్నోలోని ఓ సభలో ఆయన మాట్లాడుతూ, 'హనీమూన్, పిక్నిక్ కోసం దళితుల ఇళ్లకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెళుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ కు చెందిన యువతిని చేసుకునేందుకు ఇష్టపడని రాహుల్, ఓ విదేశీ అమ్మాయిని చేసుకుంటే ప్రధాని కాలేడని అతనికి తల్లి సోనియా చెప్పిందన్నారు. అందుకే ముందు ప్రధాని అయ్యాక తర్వాత ఏ ఫారిన్ గాళ్ నో చేసుకొమ్మని చెప్పినట్లు రాందేవ్ అన్నారు.
వీటిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్, రాందేవ్ చేసిన కామెంట్లు దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఖండించారు. ఇందుకు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. మరోవైపు యోగా గురువు వ్యాఖ్యలపై కొంతమంది దళిత కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, మహిళా కమిషన్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అటు తన మాటలు కలకలం సృష్టించాయని తెలియడంతో... తాను చేసిన వ్యాఖ్యలు దళితులను ఇబ్బంది పెట్టి ఉంటే వెనక్కి తీసుకుంటానని రాందేవ్ చెప్పారు.