: జెస్సీ రైడర్ మాట్లాడాడు
కివీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ జెస్సీ రైడర్ క్రమంగా కోలుకుంటున్నాడు. మూడ్రోజుల క్రితం దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన రైడర్ ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, చికిత్సకు స్పందిస్తున్న రైడర్ నిన్న కోమాలోంచి బయటకు వచ్చాడు. కాగా, ప్రమాదకరమైన గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్న రైడర్ నేడు కొద్దిగా మాట్లాడినట్టు సమాచారం. రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ను తానెంతగానో మిస్సవుతున్నట్టు రైడర్ విచారం వ్యక్తం చేశాడట.
ప్రస్తుతం రైడర్ ఆసుపత్రి గదిలో కొద్దిగా నడవగలుగుతున్నాడని అతని మేనేజర్ ఆరోన్ క్లీ చెప్పారు. గత కొంత కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రైడర్ న్యూజిలాండ్ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేదికపై సత్తా చాటి తిరిగి జట్టులోకి రావాలన్నది రైడర్ ఆలోచన అని క్లీ వెల్లడించారు. అయితే, అతన్ని దురదృష్టం వెంటాడిందని విచారం వ్యక్తం చేశాడు.