: కేబినెట్ బెర్త్ కోసం షబ్బీర్ అలీ తహతహ
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ అజాద్ ని అడ్డం పెట్టుకుని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన షబ్బీర్ అలీ చూపు ఇప్పుడు మంత్రి పదవి మీద పడింది. ఎలాగైనా కిరణ్ కేబినెట్ లో స్థానం సంపాదించాలని షబ్బీర్ తహతహలాడుతున్నారు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందని ఇవాళ తన మనసులో మాట బయటపెట్టారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమని తెలిపారు.
కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు ఏకపక్ష నిర్ణయమని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. 2004 ఎన్నికల్లో రైతులకు ఉచిత విద్యుత్ హామీతోనే అధికారంలోకి వచ్చిన విషయం మరువరాదన్నారు. ఇదిలా ఉండగా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డినుంచి పోటీకి దిగిన షబ్బీర్ అలీ వరుసగా రెండుమార్లు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.