: మోడీ 'రోడ్ షో' కోసం బయటివారిని అద్దెకు తెచ్చారు: కాంగ్రెస్
వారణాసి స్థానానికి నిన్న నామినేషన్ దాఖలు చేసే ముందు నరేంద్రమోడీ భారీ 'రోడ్ షో' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. దానిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. రోడ్ షో కోసం 75 శాతం మంది బయటివారిని అద్దెకు తీసుకొచ్చారని ఆరోపించింది. ర్యాలీలో పాల్గొన్న వారంతా ఒకే రకమైన టీ షర్టులు ధరించి ఓ ప్రదర్శనలా మార్చేశారని వ్యాఖ్యానించింది. మరోవైపు మోడీ రోడ్ షోపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. పోలింగ్ జరుగుతున్న రోజే నామినేషన్ వేసి రోడ్ షో ద్వారా ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. మోడీకి వస్తున్న ఆదరణను చూసి, ఓర్వలేకే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు.