: ఐపీఎల్ రేపే.. అందరి కళ్ళూ సాల్ట్ లేక్ వైపే..
కొందరికది కాసుల వర్షం కురిపించే క్రికెట్ ఖజానా.. మరికొందరికి పసందైన పరుగుల విందు.. వెరసి అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనబడే ఐపీఎల్. 2008 లో జరిగిన తొలి సీజన్ నుంచి మొన్నటి ఐదో సీజన్ వరకు ప్రేక్షకులకు వినోదాన్ని అందివ్వడంలో ఈ లీగ్ విఫలమైంది లేదు. అంతగా ప్రజాకర్షణ పొందిన ప్రైవేటు క్రికెట్ లీగ్ ప్రపంచంలో మరోటి లేదు. చిట్టిపొట్టి ఫార్మాట్ టి20 క్రికెట్ కు భారీ తనాన్ని అద్దిన ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూడడంలో వింతేముంది!
ఈ క్రమంలో రేపు ఐపీఎల్ ఆరవ సీజన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్నిరేపు సాయంత్రం అంగరంగ వైభవంగా వీక్షకులకు సాక్షాత్కరింపజేసేందుకు కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బాలీవుడ్ బాద్షా, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూక్ ఖాన్, అందాల తార కత్రీనా కైఫ్ ఈ భారీ ఈవెంట్ ఓపెనింగ్ లో తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.
ఇక వీరికి తోడు ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ పిట్ బుల్ తన గాన మాధుర్యంతో భారతీయులను సమ్మోహితుల్ని చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కార్యక్రమానికి తొలుత పాప్ క్వీన్ జెన్నిఫర్ లోపెజ్ ను ఆహ్వానించాలని భావించినా, ఆమె కోర్కెల జాబితా విని ఐపీఎల్ నిర్వాహకులు కంగుతిన్నారు. లోపెజ్ తో కాదనుకుని చివరకు పిట్ బుల్ వైపు మొగ్గారు.
ఈ ర్యాప్ స్టార్ ఆలపించిన పలు గీతాలు నిరుడు అమెరికా తదితర దేశాల్లో చార్ట్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఇంకా చైనీస్ కళాకారుల బృందం ఫ్లయింగ్ డ్రమ్స్ విన్యాసాలు ప్రదర్శించనుంది. మరుసటి రోజు ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్న తరుణంలో ఆయా జట్లు మార్చ్ పాస్ట్ నిర్వహిస్తాయని తెలుస్తోంది.