: ఇక ప్రజల చేతుల్లోకి మలేసియా విమానం నివేదిక
మిస్టరీగా మారిన మలేసియా విమానం అదృశ్యం ప్రాథమిక దర్యాప్తు త్వరలోనే ప్రజల చేతుల్లోకి రానుంది. విమానం గల్లంతుపై ఆలస్యంగా మేల్కొని నివేదిక తయారీకి ఆదేశించిన మలేసియా ప్రభుత్వం... ఇప్పటికే దర్యాప్తు నివేదికను ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ)కు పంపినట్టు తెలిపింది. ఐసీఏఓ నుంచి నివేదిక రాగానే దానిని విడుదల చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని మలేసియా ప్రభుత్వం తెలిపింది. కాగా విమానం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత నెల 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన విమానం కాసేపటికే దారిమళ్లి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో 239 మంది ప్రయాణికులు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ కోసం ఏ మూలో మిణుకుమిణుకుమంటున్న ఆశతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు మలేసియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తీవ్రం చేస్తున్నారు. దీంతో నివేదిక ప్రజల ముందుంచేందుకు మలేసియా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.