: మయన్మార్ లో మళ్లీ పత్రికలు.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..!
మయన్మార్.. భారత్ పొరుగునే ఉన్న చిరుదేశం. సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ దేశంలో 50 ఏళ్ళుగా దినపత్రికలపై కొనసాగిన ఆంక్షలకు నేటితో తెరపడింది. ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉన్న దినపత్రికలు తమ కార్యకలాపాలు సాగించవచ్చన్న జుంటా ప్రభుత్వం ఆదేశంతో ప్రజల ముంగిటకు వార్తా పత్రికలు వచ్చి వాలాయి. ప్యడాంగ్సు, ష్వె నాయింగ్ ఎన్గాన్ థిట్, శాన్ టావ్ చీన్, వాయిస్ డైలీ నేటి నుంచి తమ ముద్రణ షురూ చేశాయి.
కాగా, ఇప్పటివరకు మయన్మార్ లో 'యూనియన్ డైలీ' పేరిట అధికార 'యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ' (యూఎస్ డీపీ) దినపత్రిక నిర్వహించింది. గత డిసెంబర్ లో మయన్మార్ ప్రభుత్వం మీడియా సంస్కరణలకు తెరలేపింది. అప్పటివరకు ఉన్న 'వార్తల పరిశీలన' విధానాన్ని ఎత్తివేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో ప్రెస్ కౌన్సిల్ లోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.