: గల్లంతైన మలేషియా విమానం కోసం 'టైటానిక్ ట్రైల్'
మలేషియా విమానం కనిపించకుండాపోయి అప్పుడే 50 రోజులు దాటి పోయింది. అయినా ఇంతవరకు ఎంహెచ్ 370 ఆచూకీ దొరకలేదు. దాంతో ఆ విమాన జాడ తెలుసుకునేందుకు గతంలో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక జాడ కోసం ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే మలేషియా, చైనా, యూఎస్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డేవిడ్ జాన్ స్టన్ తెలిపారు.
227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి ఎంహెచ్ 370 విమానం బీజింగ్ బయల్దేరింది. ఆ విమానం బయల్దేరిన కొన్ని గంటలకు విమానాశ్రయంలోని ఏటీసీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ కోసం ఇప్పటికే పలు దేశాలు సముద్రంలో అణువణువు గాలించినా ఫలితం కనిపించలేదు. దాంతో టైటానిక్ కోసం వినియోగించిన టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు ఎంహెచ్ 370 ఆచూకీ తెలుసుకోవచ్చని ఆస్ట్రేలియా భావిస్తోంది.
టైటానిక్ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో హిమ పర్వతాన్ని ఢీకొని మునిగిపోవడం... ఆ దుర్ఘటనలో ఓడలోని 1500 మంది జలసమాధి కావడం విదితమే. అప్పటి నుంచి టైటానిక్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన తర్వాత ఎట్టకేలకు 1985లో అట్లాంటిక్ మహాసముద్రంలో 3,800 మీటర్ల అడుగున టైటానిక్ ను కనుగొన్నారు.