: సోనియా అడ్డగోలుగా విభజిస్తే... అందుకు బాబు సహకరించారు: జగన్
గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రాన్ని సోనియా అడ్డగోలుగా విభజిస్తే అందుకు చంద్రబాబు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఆయనకు ప్రజలు ఒక లెక్కా? అని అన్నారు. దొంగ హామీలతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఎలాంటినేత కావాలో, ఎలాంటి సీఎం కావాలో ఆలోచించి మరీ ఓటు వేయాలని జగన్ కోరారు. పేదల పక్షాన నిలిచే వారినే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేదల గుండెల్లో నేటికీ వైఎస్ నిలిచే ఉన్నారని, ఆయన మరణానంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు విశ్వసనీయత, నిజాయతీ, కుళ్లుకు మధ్య జరుగుతున్న పోటీ అని పేర్కొన్నారు.