: ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడిక నో అడ్వాన్స్!
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఎలాంటి ముందస్తు చెల్లింపులూ (అడ్వాన్స్) చేయవద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2వ తేదీ నుంచి విభజన అమల్లోకి వచ్చి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా ఏర్పడనున్నందున మున్ముందు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకూడదనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఎన్నికల పనులకు మినహా ఎలాంటి పనులకూ రవాణా ఖర్చులు లాంటి ఏ విధమైన ముందస్తు చెల్లింపులు ఇవ్వొద్దని ఆదేశించింది. ఎన్నికల వ్యయం నిమిత్తం తీసుకున్న అడ్వాన్స్ తాలూకు లెక్కలను మే 24 లోగా సంబంధిత అధికారులు బిల్లులతో సమర్పించాల్సి ఉంటుంది.
ఇక, మే నెలలో పదవీ విరమణ చేయనున్న సుమారు రెండు వేల మంది ప్రభుత్వోద్యోగులకు అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలనూ వారం రోజుల ముందే చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో, వారికి రావాల్సిన గ్రాట్యుటీతో పాటు జీపీఎఫ్, పెయిడ్ లీవ్స్ తదితరాలన్నిటినీ మే 24కే అందించనున్నారు.